మాతృభాష పై గేయం!

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో...
                ఈ గేయం...!

ఎటు బోయె ఎటు బోయె నామాతృభాషా
పరభాషకంకితము నా పాఠశాల!
మాతృ గడ్డ మీద మరులుడిగి పోయె
డాలరూ మోజయ్యి డాబుసరియయ్యె!!

చదివినా చదువుకూ విలువలేకుండే
కొలువు కరువయ్యీ ఖండాలు దాటే
భాషలో పట్టుకై పరభాష మోజయ్యి
మాతృభాష ల్ని మర్చిపోయాడే!!

పరదేశమేగీ కోట్లు సంపాదించి
కన్నవారికె దూరమయ్యీ
మాతృభూమిని మరిచినాడే
మాత పితరులకె బంధువైనాడే!!

ఎందరెందరొ చదువ కొందరే వెళ్ళగా
మిగిలినోళ్ళకు మిగిలె పని వెదుకులాటా
చేతి నిండ పనులు చెంత లేకుండగ
ఉద్యోగమేమొ ఊసులేకపాయె!!

మాతృ భాష మరిచి,పరభాష పనిలేక
అటు,నిటూగాకుండ ఆధారమేలేక
బ్రతుకు దారి గనక నుండనేల?
గమ్యమెరుగని బాటసారి వేల!!

ఎన్ని జూచిన గాని,యెరుగడే యీమనిషి
పిల్లవాని మనసు యెరుగబోకుండనే
ఆంగ్ల పాఠశాల కంప నేర్చిన వాడే
ప్రభుత గూడ మార్చె బోధనమును!!

అసలు సిసలు మాట అందమైన బాట
మాతృభాష తోటె పరభాష నేర్చుట
సాధ్యమౌను తెలియ తెలుగు వాడ!
మనసు బెట్టి నడువ మాన్యుడవేనుర!!

ఎటు బోయె ఎటు బోయె నామాతృభాషా
పరభాషకంకితము నా పాఠశాల!
ఎక్కడని వెదికేది ఈ బ్రతుకు త్రోవ
భవిత నీదె యెరుగ నీ మాతృ భాష!!
                    *****
           --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

****ప్రభుత్వ పాఠశాలలన్నీ ఆంగ్ల బోధనా పాఠశాలలుగా మారుతాయన్న వార్తను విన్న సందర్భం లో....


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)