కణజీవి కథ (ఉత్తర భాగం) (పద్య కవిత)
కణజీవి కథ
(ఉత్తర భాగం)
పొంచి ఉన్న ముప్పు మునుముందె ఉన్నదీ
మర్చిపోయి యెపుడుమసలబోకు
విజయమందితినని విర్రవీగకు మోయి
అంతమొందలేదు ఆకణమ్ము!!
అంతమెప్పుడనుచు నారాటపడబోకు
ఓర్మిగలిగినంత నొప్పు యౌను
కలిమి లేము లేవి కారణమ్ములుకావు
అంతమొందలేదు ఆకణమ్ము!!
పొరుగిండ్ల కనుచు పోవలదుపనులే
మియును లేక, దూర మేల మనకు
చాలు నింక యనిన, సడిలేక వచ్చును
అంతమొందలేదు ఆకణమ్ము!!
సీత గీత దాటి సంతసమ్మును వీడె
కష్టమెల్ల నవియు కానలేమె
బురదలోన బొరలి పోరుసల్పి నటుల
అంతమొందలేదు ఆకణమ్ము!!
మాయలాడి యదియ మర్మమెరిగి తిర్గు
రోగకారకమ్ము రోదనిచ్చు
లాకుడౌను బోవ లౌక్యంగ మసలుకో
అంతమొందలేదు ఆకణమ్ము!!
షేకుహాండు యెపుడు క్షేమమ్ముగాదయ్య
వందనమ్ములనిన నమ్మదగును
రెండు చేతులెత్తి జోడించు చాలును
అంతమొందలేదు ఆకణమ్ము!!
అవసరమ్ముదీర వాహనమ్ము నడుప
వాయుకలుషితమ్ము పరుగు దీయు
దూరదూరముండి దొరవోలె బ్రతుకుము
అంతమొందలేదు ఆకణమ్ము!!
గుట్క పాను నమిలి ఘోరంగ వుమ్మకు
రోడ్డు పాడుజేయ రోగ మొచ్చు
తొందరేలనయ్య తోడు వచ్చు కణము
అంతమొందలేదు ఆకణమ్ము!!
నేటి దాక మనము నేరకుంటిమిగదా
రోగజీవిజంప రూఢి గాను
విచ్చుకొన్న కణము వీడకుండు ననిరి
అంతమొందలేదు ఆకణమ్ము!!
వేసిన వెనుకడుగు వేసేది ముందుకే
యనిరి వైద్యులంత, కనుగొనంగ
వాక్సినెప్పుడొచ్చు వాడుటెపుడొగదా
అంతమొందలేదు ఆకణమ్ము!!
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి