నిశ్శబ్ద సవ్వడి!(కవిత)
నిశ్శబ్ద సవ్వడి!
**************
రెక్క విప్పిన రెవెల్యూషన్ తెచ్చిన స్వేచ్ఛ
నేటికీ రెప రెపలాడుతూనే ఉంది
డెబ్బది మూడేళ్ల నుండి,
పురివిప్పిన ప్రజాస్వామ్యం పోకడ
పరిఢవిల్లుతూనే ఉంది నేటికీ!
పదితలల రావణుడికైనా భయపడని
రామచంద్రులు తలలు వంచి
పాదాక్రాంతం చేస్తున్నరు నేడు
రెప రెప లాడే జెండాలు రేపటి
స్వాతంత్ర్య దినాన ఎగిరి నా
ఆనాటి సంబరాలు
గతకాలపు స్మృతుల్లా మిగిలిపోనున్నట్లే
కళ కళలాడే పిల్లల ముఖాలు
తీపి బిల్లలకైనా నోచుకుంటాయో లేదో
ఆటలు అటకెక్కె, పాటలు పాతజ్ఞాపకాలయ్యె
పతాకానికి వందనం చేయడానికైనా
సామాజిక దూరం అడ్డు వచ్చే
నింగి నంటే నినాదాల చప్పుళ్లు
తెరవేసిన నాటకంలా మిగిలిపోవునేమో
ప్రభాత, ప్రభోదగీతాల సవ్వడులు
నిశ్శబ్ద గీతాలై
నిండు నూరేళ్ళు జీవించాలన్న జిజ్ఞాస లో
కలిసి పోతాయేమో!
కంటికి కనిపించని కణమా
ఎంతపని చేశావే! ఏడని వెదకను నిన్ను!
ఏం చేయగలను?
నాసమాజపు రేపటి పౌరులకేమని చెప్పను?
*****
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామారెడ్డి
సెల్: 9866447234.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి