కవిత!
జంట విహంగాల గగన గమనం
జంట ప్రేమికుల జలవిహారం
విహంగాలకు కులంలేదు గోత్రం లేదు
జంట ప్రేమికులకు కులగోత్రాలు కానరావు
యుగ ధర్మం మారొద్దని
వేదాలు ఘోషిస్తున్నాయా
సాంప్రదాయం ఏంచెప్పినా
మానవ ధర్మం మారుతూనే ఉంది
మనుషుల మనస్తత్వం
మారణ హోమం సృష్టిస్తూనేవుంది!
మతం మత్తులా విస్తరిస్తుంటే
కులం అడ్డు గోడల్ని చీల్చుకుంటూన్న యువత
రిజర్వేషన్లను వదలనంటున్నది
వర్ణసంకరం జరిగిన జంట
వంశాంకురానిదేకులం?
అంటూ ప్రశ్నిస్తున్నది.
కులవర్గాల విశ్లేషణ ఈనాటిది కాదు
కాకుంటే అంతరాల అంతర్మథనం
మనల్ని వేధిస్తున్న సమస్య!
అంతరంగం లోని ఆంతర్యం
అంతుబట్టని సమస్య!
కులాలకు చిన్నాపెద్దలేమిటి?
జీవించటం అందరిహక్కు
ఆత్మగౌరవానికి తరతమభేధమా!
సమానత్వం సమభావం సాధనయేలక్ష్యం!
అందుకు గురి కుదరాలి నిబద్ధత ఉండాలి!
చట్టాలు చిట్కాలు కావు
చిట్కాలతో మాయమయ్యే చిరు సమస్య కాదు
జ్ఞాన సముపార్జన అందరి హక్కు
జ్ఞానం ముఖవర్చస్సు కు తేజస్సు
విజ్ఞాన ప్రపంచం లో కులవివక్ష
నీలి మబ్బులాంటిది,నీడలా వెన్నంటి నిండా ముంచేది!
అందుకే రిజర్వేషన్ ఒక అస్త్రమై
రాజకీయులకు సమ్మోహన మయ్యింది
ఓటు బ్యాంకు వజ్రాయుధమై
దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతోంది
దేశం వెనుకబాటు తనానికివి గీటు రాళ్ళు
రిజర్వేషన్ లయినా, తాయిలాల సొబగులయినా
అన్నీ దేశపు వెనుక బాటుతనానికి గీటు రాళ్ళే!
ఇవన్నీ కనుమరుగయ్యే కాలమొచ్చిన్నాడు
దేశం ముందంజ వేసినట్టు
కాకుంటే ముందంజ వెనుకబాటులో మనమెప్పుడూ మొదటి ర్యాంకే!!
********"
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి