బాధిత మహిళకేదీ ఊరట?(కవిత)
బాధిత మహిళకేదీ ఊరట?
***********************
నట్టింట నడయాడుతున్న నెట్టింట్లో
'యూ'గొట్టపు విషపు కత్తులు
యువరక్తాన్నురకలేయిస్తుంటే
కీచకులే కీర్తి కిరీటాలు
తొడుక్కోక యేంచేస్తారు?
చట్టాలు చుట్టాలై న్యాయాన్ని
నడిబొడ్డున అపహాస్యం చేస్తుంటే
కీచకులకు కీర్తి భుజకీర్తులు కాకుంటాయా?
చట్టం అందరితో సమానంగా ఆడుకుంటే
కొందరే పదవిలేహ్యం ఎందుకు పూసుకుంటారు?
నిరసించిన చట్టమే ఎందుకు నీరసించి పోతుంది?
యాంత్రిక యుగం తాంత్రిక యుగం గా ఎందుకు మారుతుంది!
స్వచ్ఛభారతంటూనే కల్తీ కందెనను పులుముకొని
విషపు నవ్వులు నవ్వే విషనాగుల్నివదిలేసి
మధ్యతరగతి మందభాగులవెంటబడితే ఏమొరుగుతుంది?
తినే తిండి కల్తీ,పీల్చే గాలి కల్తీ,మనసులూ కల్తీయే అయినప్పుడు
యోగులైనా భోగులే అవుతున్నరు!
నాగరికత నగుబాటవుతుంటే
తుంటిరి వెధవలకు తల్లీ,చెల్లికి తేడా తెలియకుండా పోతోంది
పసిపిల్లకీ, వయసుడిగిన వారందరూ ఒకే విధంగా కనిపిస్తూన్నరు
రాజకీయం వెన్నంటి ఉన్నంత కాలం పోకిరీలకు దీటుండదు
మోసాలకు మోక్ష ముండదు
ఆడపిల్లకు రక్షణుండదు
చట్టాలెన్నున్నా నేతల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి
బడా బాబులకు కాపలాగా,
బాధితులకుద్యమమే దిక్కై,
ప్రజలే రక్షణ కవచాలు గా
పరిపాలకుల చేతిలో చట్టం కొరడాగా మారితే
బాధిత మహిళ కు కొంత ఊరట...
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
***నెట్టింట్లో=ఇంటర్నెట్ లో
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి