సత్కారం!(కవిత)

             సత్కారం!
             *********
గతం గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తోంది
వర్తమానం వెర్రిగా నవ్వేస్తోంది
భవిష్యత్ భయపెట్టి భగ్గుమంటోంది
కాలం వికటాట్టహాసం చేసి కవ్విస్తోంది

కాలజ్ఞానం నిజమని ఘోషిస్తోంటే
ఒకటొకటిగా విష్లేషిస్తూన్నవేళ
ఓ మనిషీ కళ్ళు తెరిచి చూడు
కర్తవ్యం కళ్ళముందు కదలాడ్డం లేదా

నాయకత్వం కోసం వెంపర్లాడి
విమర్షే పరమావధిగా విజ్ఞత
మరిచిన మానవతా వాదివై
పదివికోసం ప్రాకులాడాటమేనా

తాయిలాల కంపులో
తలతాకట్టు పెట్టి 
పెట్టుబడి పంచడమేనా నీపని?
పసలేని ఫలితాలు ప్రజల ఘోష
పట్టని పురాణ కాలక్షేపాలు!

హెచ్చరికలు ఆపదలనాదుకోని ఆలంబనలు
సుభాషితాలు సుఖజీవన సుప్రభాతాలు
భోగలాలస తార్కాణాలు
చట్టాలు చుట్టకంపు వాసనలై
ఆర్తులకందనంత దూరంగా
ఆశావహుల అవకాశ పందిల్లై
డబ్బుజీవుల డప్పు కొడుతుంటే
విజ్ఞులు విక్రమార్క కథల్లోని భేతాలుడిలా
పరీక్షిస్తూంటే,
అక్రమార్కులు రాజ్యమేలి
రంగుల కలల్లోఆశల విరులను పూయిస్తూంటే

కథల్లో రాకుమారుల్లా కలలుకంటూ
ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే
నాయకజనం నేటికైనా మారి
క్రొత్త వత్సరానికి క్రొంగొత్త రుచులగ్రోలి
పండుగ జేసుకునే పేదల కళ్ళళ్ళో
ఆశల పూలు వికసిస్తాయా!
శ్రీ వికారికి పలికే వీడ్కోలు
శార్వరికి స్వాగత సత్కారం
కావాలి ప్రతిభా పురస్కారం!!

              *********

          --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)